Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రపంచ నంబర్‌వన్‌ జట్టు దక్షిణాఫ్రికాను డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ ఆల్‌రౌండ్‌ షోతో దెబ్బ కొట్టింది. చాంపియన్స్‌ ట్రోఫీలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. గ్రూప్‌ ‘బి’లో ఆదివారం జరిగిన పోరులో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేపట్టిన దక్షిణాఫ్రికా 44.3 ఓవర్లలో 191 పరుగులు చేసి ఆలౌటైంది. డికాక్‌ (72 బంతుల్లో 53; 4 ఫోర్లు) రాణించాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్, బుమ్రా చెరో 2 వికెట్లు తీయగా… జడేజా, అశ్విన్, పాండ్యా తలా ఒక వికెట్‌తో టాపార్డర్‌ను దెబ్బతీశారు. తర్వాత భారత్‌ 38 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసి జయభేరి మోగించింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (83 బంతుల్లో 78; 12 ఫోర్లు, 1 సిక్స్‌) తన సూపర్‌ ఫామ్‌ చాటగా… కెప్టెన్‌ కోహ్లి (101 బంతుల్లో 76 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకున్నాడు.

ప్రొటీస్‌ బౌలర్లలో మోర్కెల్, తాహిర్‌ చెరో వికెట్‌ తీశారు. బుమ్రాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ప్రస్తుతం గ్రూప్‌ ‘బి’లో భారత్‌ నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఫలితంగా సెమీఫైనల్లో గ్రూప్‌ ‘ఎ’లో రెండో స్థానం పొందిన బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడటం దాదాపుగా ఖాయమైంది. నేడు పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య గెలిచిన జట్టు కూడా నాలుగు పాయింట్లతో భారత్‌తో సమఉజ్జీగా ఉంటుంది. అయితే భారత్‌ రన్‌రేట్‌ చాలా మెరుగ్గా ఉండటంతో శ్రీలంక లేదా పాక్‌ రెండో స్థానానికే పరిమితం కావొచ్చు.

స్పిన్‌తో మొదలైన పతనం
టాస్‌ గెలిచిన కోహ్లి ఫీల్డింగ్‌కు మొగ్గుచూపాడు. దీంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను డికాక్, ఆమ్లా ప్రారంభించారు. ఇద్దరు జాగ్రత్తగా ఆడటంతో తొలి 10 ఓవర్లలో 35 పరుగులే వచ్చాయి. కోహ్లి స్పిన్నర్లను దించినా…రన్‌రేట్‌ మందగించినా… వికెట్‌ కాపాడుకొని ఓపెనర్లు శుభారంభమిచ్చారు. జట్టు స్కోరు 76 పరుగుల వద్ద ఎట్టకేలకు ఇన్నింగ్స్‌ 18వ ఓవర్లో అశ్విన్‌… ఆమ్లా (54 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్‌) వికెట్‌ తీసి భారత శిబిరంలో ఆనందం నింపాడు. తర్వాత వచ్చిన డుప్లెసిస్‌ (50 బంతుల్లో 36; ఒక ఫోర్‌) కూడా నింపాదిగానే ఆడటంతో 22వ ఓవర్లో జట్టు స్కోరు 100 పరుగులకు చేరింది. డికాక్‌ 68 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాక ఆ మరుసటి ఓవర్లోనే జడేజా క్లీన్‌బౌల్డ్‌ చేశాడు.

ఇంతదాకా బాగానే ఉన్నా జట్టు స్కోరు 140 పరుగుల వద్ద డివిలియర్స్‌ (16) రనౌట్‌తో మొదలైన పతనం వడివడిగా సఫారీని ముంచేసింది. సమన్వయ లోపంతో ఆ తర్వాతి ఓవర్లోనే మిల్లర్‌ (1) కూడా రనౌట్‌ కాగా, మోరిస్‌ (4), ఫెలుక్‌వాయో (4)లను బుమ్రా ఔట్‌ చేశాడు. రబడ (5), మోర్కెల్‌ (0) భువీ బౌలింగ్‌లో నిష్క్రమించారు. ఫలితంగా 140/2 స్కోరుతో పటిష్టంగా ఉన్న దక్షిణాఫ్రికా 191కే ఆలౌటైంది. ఓవైపు డుమిని (20 నాటౌట్‌) పోరాడుతున్నా మరో ఎండ్‌లో వికెట్ల పతనంతో ఏమీ చేయలేని స్థితి. తాహిర్‌ (1)తో రనౌట్ల సంఖ్య 3కు చేరింది. సఫారీ జట్టు చివరి 8 వికెట్లను కేవలం 51 పరుగుల వ్యవధిలోనే కోల్పోవడం గమనార్హం

‘సూపర్‌’ శిఖర్‌
భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తన సూపర్‌ ఫామ్‌ కొనసాగించాడు. ఆరో ఓవర్లోనే రోహిత్‌ శర్మ (12) వికెట్‌ పడినప్పటికీ కెప్టెన్‌ కోహ్లితో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. చేయాల్సిన లక్ష్యం సులువైనదే కావడంతో భారీషాట్లకు వెళ్లకుండా బాధ్యతాయుతంగా ఆడారు. దీంతో భారత్‌ 13వ ఓవర్లో 50 పరుగుల్ని, 21వ ఓవర్లో 100 పరుగుల్ని అధిగమించింది. ప్రత్యర్థి కెప్టెన్‌ బౌలర్లందరిని మార్చిమార్చి ప్రయోగించినా శిఖర్, కోహ్లిల ఏకాగ్రతను దెబ్బతీయలేకపోయారు. ఈ క్రమంలో ముందుగా ధావన్‌ 61 బంతుల్లో, కోహ్లి 71 బంతుల్లో అర్ధసెంచరీలు సాధించారు. లక్ష్యం దిశగా సాగుతున్న తరుణంలో జట్టు స్కోరు 151 పరుగుల వద్ద ధావన్‌ ఔటయ్యాడు. తాహిర్‌ బౌలింగ్‌లో డు ప్లెసిస్‌కు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. దీంతో రెండో వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్, కోహ్లితో కలిసి మిగిలిన లాంఛనాన్ని పూర్తిచేశాడు.